రోడ్డుపై అత్యవసరంగా దిగిన విమానం

ఎన్‌సీసీ ఉపయోగించే రెండు సీట్ల చిన్న విమానం ఇంజిన్ లోపంతో ఢిల్లీ సమీపంలో రహదారిపై గురువారం అత్యవసరంగా దిగింది. సదర్‌పుర్ గ్రామ సమీప ఎక్స్‌ప్రెస్‌వేపై మధ్యాహ్నం 1.45 గంటలకు ఘటన జరిగిందని, విమానంలోని పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని ఘజియాబాద్ ఎస్పీ కళానిధి నైథాని తెలిపారు. బరేలీ నుంచి హిండాన్ విమానాశ్రయానికి ఉదయం 11.16 గంటలకు విమానం బయల్దేరిందని, అత్యవసరంగా రహదారిపై దిగినప్పుడు ఎడమ రెక్క దెబ్బతిన్నదని పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. దీన్ని శిక్షణ కోసం ఎన్‌సీసీ వినియోగిస్తున్నదని పోలీస్ అధికారి చెప్పారు.