గొల్లపూడి మారుతీ రావు సినిమాలలోకి రాకముందు అనేక నాటకాలలో ముఖ్య పాత్రలు పోషించారు. చిన్న వయస్సులో రాఘవ కళానికేతన్ పేరున నాటక బృందాన్ని నడిపిన గొల్లపూడి .. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు వంటి నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు, ప్రధానపాత్రధారిగా నటించాడు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కె.వి.గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాలగది నాటకంలోనూ, భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించాడు గొల్లపూడి. మనస్తత్వాలు నాటకాన్ని ఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఈ నాటకం ప్రతి ఒక్కరిని అలరించింది. ఇందుకు గాను అప్పటి సమాచార, ప్రసార శాఖామాత్యుడు బి.వి, కేశ్‌కర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు గొల్లపూడి.